ఏపీ జర్నలిస్టులకు ‘సమగ్ర బీమా’

యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్సు స్కీం పేరు మార్పు
ఇకమీదట వైఎస్సార్ జర్నలిస్టుల బీమాగా అమలు
మంత్రి పేర్ని నానికి కృతజ్ఞతలు తెలిపిన ఎన్.ఎ.ఆర్.ఎ.

విజయవాడ, ఆగస్టు 14 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ పూర్తి స్థాయి సమగ్ర ప్రమాద బీమా (ఫుల్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్సు స్కీం)ను కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అధికార మార్పిడితో గత ఏడాది మేలో సాంకేతికంగా నిలిచిపోయిన ఈ ‘వర్కింగ్ జర్నలిస్టుల కాంప్రహెన్సివ్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్సు పాలసీని సమాచార, పౌర సంబంధాల మంత్రిత్వ శాఖ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి ప్రతిపాదన మేరకు ప్రభుత్వం కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అలాగే పాత పేరును ఇకమీదట ‘వైఎస్సార్ జర్నలిస్టుల బీమా’గా మార్పుచేస్తూ పథకం అమలుకు 2020-2021 ఆర్ధిక సంవత్సరానికి అవసరమైన 42.63 లక్షల రూపాయల బడ్జెట్‌ను విడుదల చేసింది.

రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల మంత్రిత్వ శాఖ కమిషనర్ కార్యాలయం ఈ ఏడాది మే 6న ప్రభుత్వానికి పంపించిన ప్రతిపాదనల ప్రకారం, ఏపీలో సుమారు 21 వేల మంది వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారు. వీరిలో కొందరు అక్రిడిటేషన్‌తో సంబంధం లేకుండా సంస్థ ఐడీ కార్డుల ఆధారంగా కూడా బీమా సదుపాయాన్ని పొందారు. బీమా సదుపాయాన్ని పొందే సభ్య జర్నలిస్టులు తమ వాటాగా ఏడాదికి 198 రూపాయలు చెల్లించేవారు. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేది. ఇప్పుడూ అదే విధంగా సభ్యుడి వాటాతో పాటు ప్రభుత్వం తనవంతుగా ఒక్కొక్కరికీ 203 రూపాయలను భరిస్తుంది. ఆ విధంగా సభ్యులందరికీ సరిపడా మొత్తాన్ని (రూ. 42.63 లక్షలు) ప్రభుత్వం విడుదల చేసింది.

కరోనా విపత్తు నేపథ్యంలో ప్రభుత్వం జర్నలిస్టులకు సంబంధించి కీలక నిర్ణయమే తీసుకుందని భావించాలి. కారణం ఏదైనప్పటికీ ఏడాదిగా నిలిచిపోయిన ఈ పథకాన్ని కొనసాగించడంపై రాష్ట్రంలోని జర్నలిస్టులంతా ప్రభుత్వానికి వివిధ రూపాలలో విజ్ఞప్తిచేస్తూనే వచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), ఆ శాఖ కమిషనర్ విజయ్‌కుమార్ స్పందించి బీమా పాలసీని కొనసాగించేలా కృషిచేశారు.

మంత్రి నానికి, సమాచార శాఖకు ఎన్.ఎ.ఆర్.ఎ. ధన్యవాదాలు

కరోనా విపత్తు నేపథ్యంలో ప్రశ్నార్ధకంగా మారిన జర్నలిస్టుల జీవితాలకు భరోసా కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేసి ప్రమాద, ఆరోగ్య బీమా పథకాలను కొనసాగించాలన్న తమ విజ్ఞప్తిపట్ల స్పందించిన ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)కు, ఆ శాఖ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డికి నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఎ.ఆర్.ఎ.) కృతజ్ఞతలు తెలిపింది. గత నెల (జులై) 21న మంత్రులు పేర్ని వెంకట్రామయ్య, ధర్మాన కృష్ణదాస్, సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి సహా పలువురు ప్రభుత్వ పెద్దలను కలిసి జర్నలిస్టుల సమస్యలను విన్నవించామని, దీనికి స్పందించిన మంత్రి నాని తన శాఖ కమిషనర్‌ను ఆరోగ్య, ప్రమాద బీమా పథకాలను తక్షణమే కొనసాగించేలా ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారని, ఆ మేరకు తాజాగా ఉత్తర్వులు వెలువడడం హర్షదాయకమని ఎన్.ఎ.ఆర్.ఎ. అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్టు బండి సురేంద్రబాబు అన్నారు.

కరోనా కష్టాల్లోనూ విధులు నిర్వహిస్తూ కొవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన మీడియా మిత్రులకు నష్టపరిహారం ఇచ్చి ఆయా కుటుంబాలను ఆదుకోవడంతో పాటు వర్కింగ్ జర్నలిస్టులకు ఆర్ధిక భద్రత, బీమా, ఉచిత వైద్య సదుపాయాలను కల్పించాలని కోరుతూ ఏడాది కాలంగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నామని గుర్తుచేశారు. ‘‘మేము ఇచ్చిన వినతి పత్రంలోని అంశాలపై స్పందించిన మంత్రి పేర్ని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల మంత్రిత్వ శాఖ కమిషనర్ టి. విజయ్‌కుమార్ రెడ్డిని పిలిపించి వాటి పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. కమిషనర్ సమక్షంలోనే వినతి పత్రంలోని అంశాలపై సమీక్షించిన మంత్రి మాట్లాడుతూ కరోనా వారియర్స్ కేటగిరీలో మీడియా ప్రతినిధులను కూడా చేర్చి 50 లక్షల రూపాయల బీమా వర్తింపజేయాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఓ లేఖలో కోరారని, త్వరలో అది కార్యరూపం దాల్చే అవకాశం ఉందన్నారు. ఇతర పారిశ్రామిక రంగాలకు, వర్గాలకు మాదిరిగానే మీడియాకూ కేంద్రం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించనుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.’’ అని పేర్కొన్నారు.

‘‘రాష్ట్రంలో గత ఏడాది వరకూ అమలులో ఉన్న వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్, ప్రమాద బీమా పాలసీలను పునరుద్దించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ విజయ్‌కుమార్‌రెడ్డికి సూచించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ కరోనా కష్టాల నేపథ్యంలో వైద్యం, బీమా సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. దానికి కొనసాగింపుగానే ఇప్పటికే వైద్య బీమా అమలులోకి వచ్చింది. తాజాగా ప్రమాద బీమాను కొనసాగించేందుకు నిర్ణయించారు.’’ అని సురేంద్రబాబు తెలిపారు.

‘‘కరోనావైరస్ కష్టాలు మీడియా రంగాన్ని ఎలా ప్రభావితం చేశాయన్నది మంత్రి దృష్టికి తీసుకువెళ్లాము. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భయాందోళనల మధ్య విధులు నిర్వహిస్తున్న మీడియా ప్రతినిధుల జీవితాలకు రక్షణ లేదన్న విషయాన్ని అనేక సందర్భాలలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాము. సహజంగా ప్రతి పాత్రికేయుడు విధి నిర్వహణలో ముందుండాలని, తాను పనిచేస్తున్న సంస్థ ద్వారా ప్రజలకు నమ్మకమైన సమాచారాన్ని ముందుగా వార్తల రూపంలో అందించాలనే ఉద్దేశంతో పని చేస్తూ ఉంటారు. ఇదే క్రమంలో అనేకమంది మిత్రులు ప్రాణాంతకమని తెలిసినా రిస్కు ఫేస్ చేస్తున్నారు. కరోనా వారియర్స్ (వైద్యులు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్, పోలీసులు, పారిశుధ్య కార్మికుల) జాబితాలో మీడియా ప్రతినిధులను చేర్చకపోవడం వల్ల జరిగిన నష్టం ఎలా ఉంటుందో మీడియా ప్రతినిధుల మరణాలను చూస్తే అర్ధమవుతుంది. ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్టుల చాలా ఇబ్బందులు పడుతున్నారు. పనిచేస్తే తప్ప రోజుగడవని పరిస్థితిలో ఉన్న పాత్రికేయులు ప్రాణాలకు తెగించి మరీ కరోనా విపత్తు న్యూస్ కవరేజీ విధులు నిర్వహిస్తున్న విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికే గుర్తించే ఉంటుంది.’’ అని సురేంద్రబాబు పేర్కొన్నారు.

విపత్తు సమయంలోనూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలిచి సేవలందిస్తున్న మీడియాను ఆదుకునే చర్యలు చేపట్టి, మరణించిన మీడియా మిత్రుల కుటుంబాలను ఆదుకోవలని, కేంద్ర ప్రభుత్వం 50 లక్షల కొవిడ్-19 బీమా సౌకర్యాన్ని పోలీసులకి, డాక్టర్లకు ఇచ్చిన విధంగానే జర్నలిస్టులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. ‘‘కరోనా బారినపడి మరణించిన మీడియా ప్రతినిధుల కుటుంబాలను ఆదుకోవాలి. నష్టపరిహారంగా కొవిడ్-19 బీమాకు సమానమైన మొత్తాన్ని చెల్లించడంతో పాటు కుటుంబంలోని ఒకరికి ఉపాధి కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన కరోనా వారియర్స్‌ జాబితాలో మీడియా ప్రతినిధులను చేర్చాలి. కరోనా నేపథ్యంలో కేంద్రం వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, శానిటరీ సిబ్బంది కోసం అమలులోకి తెచ్చిన 50 లక్షల బీమా సదుపాయాన్ని రాష్ట్రంలో గ్రామ/వార్డు వాలంటీర్లకు వర్తింపజేసిన విధంగానే మీడియా ప్రతినిధులకూ వర్తించేలా చర్యలు తీసుకోవాలి.’’ అని తెలిపారు.

‘‘రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అక్రిడిటేషన్‌, ఆరోగ్య బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా కార్డుల జారీ, ఇళ్ల స్థలాల మంజూరు తదితర క్షేత్రస్థాయి సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. కరోనా విపత్తు సమయంలో నిబంధనల సాకు చూపి కొత్త అక్రిడిటేషన్ల జారీని నిలిపివేయకుండా అర్హులైన అందరికీ గుర్తింపు కార్డులు మంజూరుచేయాలి. కరోనా ఆర్ధిక కష్టాల నేపథ్యంలో మీడియా ప్రతినిధులకు ఆర్ధిక భరోసా కల్పించడంతో పాటు వివిధ వర్గాలను ప్రోత్సహిస్తున్న మాదిరిగానే మీడియా రంగాన్ని కూడా ఆదుకోవాలి. కరోనా విపత్తు అదుపులోకి వచ్చి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునేంత వరకూ మీడియా ప్రతినిధులకు నెలవారీ ఆర్ధిక ఆసరా కల్పించాలి.’’ సురేంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు.

3 Likes