Unicode fonts, anu script manager, inscript, apple etc. ఇవన్నీ ఏంది?

Unicode fonts, anu script manager, inscript, apple etc. ఇవన్నీ ఏంది?

1 Like

యూనికోడ్:

కంప్యూటర్లు ప్రధానంగా అంకెలతో పని చేస్తాయి. ఒక్కో అక్షరానికీ, వర్ణానికీ ఒక్కో సంఖ్యని కేటాయించి నిక్షిప్తం చేసుకొంటాయి. యూనీకోడ్ కనుగొనబడక ముందు, ఈ విధంగా సంఖ్యలని కేటాయించడంకోసం వందలకొద్దీ సంకేతలిపి (encoding) పద్ధతులు ఉండేవి. ఏ ఒక్క పద్ధతిలోనూ చాలినన్ని వర్ణాలు ఉండేవికాదు.
యూనికోడ్ ప్రతీ అక్షరానికీ ఓ ప్రత్యేక సంఖ్యని యూనీకోడ్ అందిస్తుంది. ప్లాట్‌ఫామ్ ఏదైనా, ప్రోగ్రామ్ ఏదైనా, భాష ఏదైనా సరే. వ్యాపార దిగ్గజాలైన ఆపిల్, HP, IBM, జస్ట్‌సిస్టమ్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, SAP, సన్, సైబేస్, యూనిసిస్, అనేక కంపెనీలు ఈ యూనీకోడ్ ప్రమాణాన్ని స్వీకరించాయి. ఆధునిక ప్రమాణాలైన XML, జావా, ECMAస్క్రిప్ట్ (జావాస్క్రిప్ట్), LDAP, కోర్బా 3.0, WML లాంటివాటికి యూనీకోడ్ అవసరం. అంతేగాక, ISO/IEC 10646 ని అమలుపరచే అధికారిక పద్ధతిది. చాలా ఆపరేటింగ్ సిస్టములూ, అన్ని ఆధునిక బ్రౌజర్లూ ఇంకా అనేక సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు ఇప్పుడు యూనికోడ్‌ని మద్దతు చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న అత్యంత ప్రముఖ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ ధోరణులలో యూనీకోడ్ ప్రమాణ అవతరణా దానిని అందించే ఉపకరణాల లభ్యత ఉన్నాయి. యూనికోడ్ ను గురించి మరింత తెలుసుకునేందుకు వికీలో పేజీలు లభ్యంగా వున్నాయి.

అను స్క్రిప్ట్ మేనేజర్:

పైన చెప్పుకున్నట్లు యూనికోడ్ లేని రోజుల్లో సంకేతలిపి (encoding) పద్ధతులుండేవి. అను స్క్రిప్టు మేనేజర్ కూడా కోవకు చెందినదే. అను ఫాంట్స్ వారు అనేక భారతీయ భాషలలో ఖతులు తయారుచేసారు. ఆయా అక్షరాలను టైపు చేసుకునేందుకు అను స్క్రిప్ట్ మేనేజర్ ను తయారు చేసారు. యూనికోడ్ రాకముందు అను ఫాంట్స్ ప్రాముఖ్యత మనందరికీ తెలిసినదే. ఈనాటికీ, డీటీపీ రంగంలో అను ఫాంట్స్ ను ప్రథమంగా వాడుతున్నారుకానీ, భవిష్యత్తంతా యూనికోడ్ దే. ఈనాటికి తెలుగు యూనికోడ్ లొ చాలా ఖతులు (ఫాంట్స్) అందుబాటులోకి వచ్చాయి. వాటిని ఈ లంకె లో చూడవచ్చు.

ఇన్ స్క్రిప్ట్, యాపిల్ కీబోర్డులు:

యాపిల్, ఇన్ స్క్రిప్ట్ అనేవి కీబోర్డు లేఅవుట్లు. అంటే, మనం ఏ బటన్ ను నొక్కితే ఏ అక్షరం వచ్చేది మనం వాడే కీబోర్డును బట్టి వుంటుంది. నావరకు నేను యాపిల్ కీబోర్డు వాడుతాను. డీటీపీ రంగంలో ఎక్కువగా కూడా యాపిల్ కీబోర్డే వాడుతారు.
ఇన్ స్క్రిప్ట్ అనేది సీడాక్ (CDAC) వారు తయారుచేసిన, భారత ప్రభుత్వం అధికారికంగా ప్రమోట్ చేస్తున్న కీబోర్డు. ఈ కీబోర్డు అన్ని భాషాలలో ఒకేలా వుంటుంది. అంటే, ఇన్ స్క్రిప్ట్ కీబోర్డు నేర్చుకున్నవారు దాదాపు అన్ని భారతీయ భాషలలోనూ టైపు చేయవచ్చు. అయితే ఈ కీబోర్డు లో కొన్ని ఇబ్బందులున్నాయి. ఉదాహరణకు కొటేషన్ మార్కులు, ఆశ్చర్యార్థకం, 1,2,3 అంకెలు టైపు చేసుకోవడం కుదరదు. వీటికోసం మళ్ళీ వేరే ఆంగ్ల కీబోర్డుకు మారాల్సి వుంటుంది. అంచేత ఈ కీబోర్డు వ్యక్తిగతంగా నాకు నచ్చలేదు.
యాపిల్ కీబోర్డును కూడా వేరే భాషలలో తయారుచేసుకోవడం సులువే.
1 Like